Mohammed Taj: ఉరిశిక్ష ఎదుర్కొంటున్న తన తల్లికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతిని వేడుకున్న కుమారుడు
- 2008లో ప్రియుడితో కలిసి షబ్నం ఘాతుకం
- ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన వైనం
- షబ్నంకు ఇటీవల ఉరిశిక్ష ఖరారు
- క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన గవర్నర్
ఉత్తరప్రదేశ్ లో షబ్నం అనే మహిళ ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత హేయమైన రీతిలో గొడ్డలితో నరికి చంపడం 2008లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో షబ్నంకు ఇటీవలే ఉరిశిక్ష ఖరారైంది. షబ్నం దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను ఇటీవలే యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తోసిపుచ్చారు. మరోసారి ఆ పిటిషన్ గవర్నర్ ముందుకు రాగా, నిర్ణయం కోసం మధుర జైలు వర్గాలు వేచిచూస్తున్నాయి. మరోసారి గవర్నర్ తిరస్కరిస్తే కనుక షబ్నంను ఉరి తీయనున్నారు.
ఈ నేపథ్యంలో, షబ్నం కుమారుడు మహ్మద్ తాజ్ రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని వేడుకున్నాడు. రాంపూర్ జైలులో తల్లిని కలిసినప్పటి భావోద్వేగాలను తన పిటిషన్ లో పొందుపరిచాడు.
షబ్నం కుమారుడు మహ్మద్ తాజ్ జైలులోనే జన్మించాడు. ఈ హత్యలు జరిగిన సమయంలో తాజ్ తల్లి గర్భంలో ఉన్నాడు. తాజ్ ను షబ్నం జైలులోనే ప్రసవించగా, ఆరేళ్ల వయసు వచ్చిన తర్వాత నిబంధనల కారణంగా తాజ్ ను జైలు నుంచి పంపించేశారు. తాజ్ అప్పటినుంచి షబ్నం స్నేహితుడు ఉస్మాన్ సైఫీ సంరక్షణలో ఉంటున్నాడు.