Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత నవోమీ ఒసాకా!
- ఫైనల్ లో బ్రాడీతో తలపడిన నవోమీ ఒసాకా
- 6-4, 6-3 తేడాతో విజయం
- మోనికా సెలెస్, ఫెదరర్ సరసన స్థానం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పోటీల మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ కు చెందిన నవోమీ ఒసాకా విజయం సాధించింది. శనివారం రాడ్ లోవర్ అరీనాలో జరిగిన ఈ పోటీలో జన్నిఫర్ బ్రాడీతో తలపడిన ఒసాకా, 77 నిమిషాల్లోనే 6-4, 6-3 తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇది ఆమెకు రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. మొత్తం మీద నాలుగవది. 2018, 2020లో యూఎస్ ఓపెన్ టైటిళ్లను ఒసాకా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్ లో ఒసాకా మరో అరుదైన రికార్డును సమం చేసింది. తానాడిన తొలి నాలుగు మేజర్ టైటిళ్ల ఫైనల్ పోరులో గెలిచిన క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో మోనికా సెలెస్, రోజర్ ఫెదరర్ లు మాత్రమే తామాడిన తొలి నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించారు. తాజా విజయంతో నవోమి కూడా వారి సరసన చేరింది. ఇదే సమయంలో ఆమె ర్యాంకు మరింత పదిలం కాగా, తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ లలో ఒకరిగానూ నిలిచింది.