YS Sharmila: షర్మిల ముందు టీఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన తెచ్చిన అభిమానులు!
- తెలంగాణలో పార్టీ పెట్టాలని భావిస్తున్న షర్మిల
- నిన్న రంగారెడ్డి, హైదరాబాద్ అభిమానులతో సమావేశం
- 'చేవెళ్ల చెల్లెమ్మ'గా వైఎస్ అభివర్ణించిన సబితా
- అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారన్న అభిమానులు
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ, కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని భావిస్తున్న వైఎస్ షర్మిల, శరవేంగంగా పావులు కదుపుతూ, పలు జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులను పిలిపించి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభిమానులతో షర్మిల సమావేశమైన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తన వద్దకు వచ్చిన వైఎస్ అభిమానులను తెలంగాణలో రాజకీయ పరిస్థితులను గురించి ప్రశ్నిస్తూ, ఓ ప్రశ్నావళిని రూపొందించి, అందించారు. దీని ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆపై తన వద్దకు వచ్చిన వైఎస్ అభిమానులతో మాట్లాడారు. ఈ సమయంలో తెలంగాణలో పార్టీ పెడితే, తామంతా మీతోనే నడుస్తామని హామీ ఇచ్చిన క్షేత్ర స్థాయి నేతలు, బీజేపీకి, కేసీఆర్ కు సరైన సమాధానం చెప్పాల్సి వుందని అన్నారు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నేత మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో అభిమానించి, 'చేవెళ్ల చెల్లెమ్మ'గా అభివర్ణించిన సబితా ఇంద్రారెడ్డి, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలోకి వెళుతున్నారని అనడం గమనార్హం. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో చేరారని ఆయన గుర్తు చేశారు.
ఇదే సమయంలో మిగతా కార్యకర్తలు పలు రకాల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావడం లేదని, స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులపై ఎంతమాత్రం నియంత్రణ లేదని ఫిర్యాదు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు, ఆరోగ్య శ్రీ, అంబులెన్స్ సర్వీసులు సరిగ్గా పని చేయడం లేదని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరారు.