WHO: మరో మహమ్మారి?... మనుషులకూ వ్యాపించిన బర్డ్ ఫ్లూ... రష్యాలో తొలి కేసు!
- పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్న వ్యక్తుల నమూనాల పరిశీలన
- వెంటనే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెప్పిన రష్యా
- నిశితంగా సమీక్షిస్తున్నామన్న డబ్ల్యూహచ్ఓ
ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో దేశాల్లో వ్యాపించి, కోట్లాది పక్షులను బలిగొన్న బర్డ్ ఫ్లూ మొట్టమొదటి సారిగా మనుషులకు సోకింది. రష్యాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని, వెంటనే ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలియజేశామని పేర్కొంది.
దక్షిణ రష్యా పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులను వెక్టార్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించారని పేర్కొన్న రష్యా ఆరోగ్య నిఘా సంస్థ రోస్ పోర్టెబెన్జాడ్జోర్ ప్రతినిధి అన్నా పొపోవా, వీరిలో ఎవరికీ తీవ్రమైన అనారోగ్యం ఏర్పడలేదని తెలిపారు. ఒకరిలో తీవ్రమైన హెచ్5ఎన్8 వైరస్ కనిపించిందని, ఇదే వైరస్ ను డిసెంబర్ లో పక్షుల్లో గుర్తించామని తెలిపారు.
ఇప్పటికే ఈ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్న అన్నా పొపోవా, ఇంతవరకూ ఈ వైరస్ మానవులకు సోకినట్టుగా ప్రపంచంలో ఎక్కడా నిర్దారణ కాలేదని గుర్తు చేశారు. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రపంచానికి మరో సవాల్ కాకముందే అన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్ మానవుల్లో మరింత మ్యూటేషన్ చెందే ప్రమాదం ఉందని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఇక, రష్యా లాబొరేటరీ నుంచి తమకు సమాచారం అందిందని స్పష్టం చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీనిపై మరింత లోతుగా పరిశోధిస్తున్నామని పేర్కొంది. ఇది మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందా? అన్న విషయమై ఇంకా స్పష్టత లేదని అన్నారు. కోళ్లు తదితర జంతువులతో నేరుగా కాంటాక్ట్ ఉన్న వారికే ఇది సోకే ప్రమాదం ఉందని వెల్లడించింది. కాగా, గతంలో మానవులకు హెచ్5ఎన్1 ఇన్ ఫ్లూయెంజా వేరియంట్ వైరస్ సోకిన వేళ, తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో 60 శాతం మంది మృత్యువాత పడిన విషయాన్ని గుర్తు చేసింది.