Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్

Novak Djokovic has won the Australian Open record ninth time
  • మెల్బోర్న్ లో పురుషుల సింగిల్స్ ఫైనల్
  • మెద్వెదెవ్ ను వరుస సెట్లలో ఓడించిన జకోవిచ్
  • 7-5, 6-2, 6-2తో విజయం
  • ప్రైజ్ మనీ కింద రూ.15 కోట్లు అందుకోనున్న జకోవిచ్
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 9వ టైటిల్ సాధించిన సెర్బ్ వీరుడు
టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో విజేతగా అవతరించాడు. మెల్బోర్న్ లో ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు జకోవిచ్ వరుస సెట్లలో డానిల్ మెద్వెదెవ్ ను మట్టికరిపించాడు. 7-5, 6-2, 6-2తో ప్రత్యర్థిని చిత్తుచేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారుడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. జకోవిచ్ కు ఇది 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.

కాగా, అద్భుత ఆటతీరుతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన పాతికేళ్ల రష్యా కుర్రాడు మెద్వెదెవ్ టైటిల్ సమరంలో జకోవిచ్ అనుభవం ముందు నిలవలేకపోయాడు. తొలి సెట్లో మాత్రం కాస్త గట్టిపోటీ ఇచ్చినట్టు కనిపించిన మెద్వెదెవ్ చివరి రెండు సెట్లలో తేలిపోయాడు. బలమైన సర్వీసులు, పదునైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విజృంభించిన జకోవిచ్ ను అడ్డుకోలేకపోయాడు.

ఈ విజయంతో జకోవిచ్ కు ట్రోఫీతో పాటు రూ.15 కోట్ల వరకు నగదు బహుమతి అందుకోనున్నాడు. ఓవరాల్ గా ఇది జకోవిచ్ కు కెరీర్ లో 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఓవరాల్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విషయంలో స్విస్ వీరుడు రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్... జకోవిచ్ కంటే ఓ మెట్టుపైన ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. మరో రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే జకోవిచ్ కూడా ఫెదరర్, నడాల్ ల సరసన చేరతాడు.
Novak Djokovic
Australian Open
Ttitle
Final
Danil Medvedev
Tennis

More Telugu News