Puducherry: పుదుచ్చేరి రాజకీయ సంక్షోభంలో అనూహ్య పరిణామాలు... పెరుగుతున్న ఎమ్మెల్యేల రాజీనామాలు
- తాజాగా మరో ఇద్దరు రాజీనామా
- పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేలు
- ఇంతకుముందే రాజీనామా చేసిన నలుగురు కాంగ్రెస్ సభ్యులు
- 12కి పడిపోయిన కాంగ్రెస్ కూటమి బలం
- రేపు సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష
పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే కూటమిలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎం నారాయణస్వామిని బలం నిరూపించుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు సాయంత్రం 5 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే మూలిగే నక్కపై తాటిపండులా నేడు మరో ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు లక్ష్మీనారాయణ, డీఎంకే శాసనసభ్యుడు వెంకటేశన్ పదవికి రాజీనామా చేశారు. దాంతో కూటమి బలం 12కి పడిపోయింది. కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇంతకుముందు రాజీనామా చేశారు.
పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 33 కాగా, వారిలో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ పుదుచ్చేరి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి అనూహ్యరీతిలో సంక్షోభంలో చిక్కుకుంది.