Pawan Kalyan: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలి: పవన్ కల్యాణ్
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పవన్ స్పందన
- తాజా నోటిఫికేషన్ తోనే న్యాయం జరుగుతుందని వెల్లడి
- తమ నేతలను బెదిరింపులకు గురిచేశారని ఆరోపణ
- ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదని వ్యాఖ్యలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా ముందు చేపట్టిన నామినేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, జనసేన నాయకులను చాలామంది బెదిరించారని పవన్ తెలిపారు. తమ నేతలపై దాడులకు పాల్పడి నామినేషన్ల వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
అయితే ఎన్నికల ప్రక్రియ ఎక్కడినుంచి ఆగిపోయిందో అక్కడినుంచే ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించడంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఆ ఫిర్యాదుల తీవ్రతతో బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయని వారికి మరో అవకాశం ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిందని పవన్ వెల్లడించారు.
నామినేషన్ వేయలేకపోవడానికి సరైన ఆధారాలను కలెక్టర్లకు చూపిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామన్నారని, అయితే ఆధారాలతో జనసేన నేతలు కలెక్టర్ల వద్దకు వెళ్లినా నామమాత్రంగా ఫిర్యాదులు స్వీకరించి పంపిస్తున్నారే తప్ప ప్రయోజనం లేకపోయిందని వివరించారు.
న్యాయం చేస్తామని ఎస్ఈసీ చెబుతున్నా తమకు నమ్మకం కలగడంలేదని, అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాజా నోటిఫికేషన్ తోనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా ఉందని, ఇప్పటికే జనసేన న్యాయవిభాగంతో మాట్లాడామని పవన్ వివరించారు.