Petrol: పెట్రోలు ధరల పెరుగుదలకు బ్రేక్!
- త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఇండియాలో పెరగని ధర
- కేంద్రం నుంచి చమురు కంపెనీలకు ఆదేశాలు
- భారం తగ్గించాల్సిందేనంటున్న విపక్షాలు
ఇండియాలో పెట్రోలు ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గడచిన రెండు వారాలుగా నిత్యమూ లీటరుపై 30 పైసల నుంచి 40 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, నేడు మారలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, ఇండియాలో మాత్రం ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మార్చలేదు. అతి త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ధరలు పెరగలేదని తెలుస్తోంది.
కనీసం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ, గతంలో ఎన్నికలు వచ్చిన సమయంలోనూ పెట్రో ధరలను రెండు, మూడు నెలల పాటు సవరించలేదని, అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమలు చేసేందుకు సిద్ధమైందని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పెట్రోలు ధర ఇండియాలోని చాలా ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర పన్నులే కారణమన్న విషయం కూడా విదితమే. చాలా దేశాల్లో పెట్రోలు ధరలు ఇండియాతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోనూ ధరలు తక్కువగా ఉంటే, ఇక్కడ మాత్రం సుంకాల పేరుతో వాస్తవ ధరలతో పోలిస్తే రెట్టింపును వసూలు చేస్తున్నారు.
ఇక ఎన్నికల పుణ్యమాని కొన్ని వారాల పాటు ధరలను పెంచే అవకాశాలు లేవని, ఈలోగా ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల సరళిని పరిశీలించి, ఎన్నికల తరువాత తిరిగి ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. పెట్రోలు ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను చెబుతూ, మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించేలా సుంకాలను తగ్గించినా, అది కేవలం రూ. 3 నుంచిరూ. 5 వరకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ధరల పెంపుపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఎక్సైజ్ సుంకాలను కొంత మేరకు ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తోంది. కాగా, ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెట్రో ధరల ప్రభావంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, తమపై భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని ఆమె గుర్తు చేశారు.