Mamata Banerjee: హలోకు బదులు జై బంగ్లా అనండి.. ప్రజలకు మమత పిలుపు
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పిలుపు
- ఢిల్లీ నేతలు బెంగాల్ వెన్ను విరిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపాటు
- అది అంత సులభమైన విషయం కాదన్న మమత
ఇకపై ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ‘హలో’ అని కాకుండా ‘జై బంగ్లా’ అనాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బెంగాల్ వెన్నెముకను విరిచేందుకు ఢిల్లీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, బంగ్లా నినాదంతో బెంగాల్ వెన్నెముక బలాన్ని చూపాలని కోరారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
అక్కడ (ఢిల్లీలో) కొంతమంది నేతలు ఉన్నారని, బెంగాల్ వెన్ను విరవడం ఎలానో తమకు తెలుసని వారు చెబుతున్నారని మమత అన్నారు. అయితే, తమ కళ్లు పెకలించడం, వెన్ను విరచడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఇకపై ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హలో అని కాకుండా జై బంగ్లా అనాలని కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా బెంగాల్ భాష కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి మమత నివాళులు అర్పించారు.