USA: మయన్మార్‌లో కొనసాగుతోన్న ప్రజల నిరసనలు.. మద్దతు ప్రకటించిన అమెరికా
- సైనికుల చర్యలను నిరసిస్తూ ప్రజల నిరసనలు
- సైనికుల చర్యలను ఆపాలని అమెరికా సూచన
- జర్నలిస్టులు, ఉద్యమకారులను విడుదల చేయాలని డిమాండ్
కొన్ని రోజులుగా మయన్మార్‌లో సైనిక పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, సైనికుల చర్యలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో వారిని అణచివేయడానికి సైనికులు ఎన్నో చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై అమెరికా స్పందిస్తూ వారి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ, మయన్మార్‌లో మళ్లీ ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సైనికులు ప్రజలపై పాల్పడుతున్న చర్యలను ఆపాలని చెప్పింది. ఈ మేరకు ఆ దేశ మిలిటరీ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైజ్ తెలిపారు.
అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిన జర్నలిస్టులను, ఉద్యమకారులను విడుదల చేయాలని చెప్పారు. ప్రజల మనోభావాలను సైన్యం గౌరవించాలని అన్నారు. కాగా, మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఫిబ్రవరి 1 నుంచి నిర్బంధంలో ఉన్నారు. సూకీని విడుదల చేయాలని ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. రెండు రోజుల క్రితం మాండలే నగరంలో నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఈ దాడిలో దాదాపు 150 మంది గాయపడ్డారు.