Budumuru Nagaraju: కేటీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు... ప్రచారానికి డబ్బులివ్వండంటూ మోసగిస్తున్న మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్
- బంజారాహిల్స్ పోలీసుల అదుపులో నాగరాజు
- నాగరాజు గతంలో ఆంధ్రా రంజీ క్రికెటర్
- దారితప్పి మోసాలకు పాల్పడుతున్న వైనం
- ఇప్పటికే పలుమార్లు అరెస్ట్
- రెయిన్ బో ఆసుపత్రి ఎండీని బోల్తా కొట్టించేందుకు యత్నం
- ఎండీ ఆరా తీయడంతో వెల్లడైన మోసం
ఆంధ్రా మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గతంలో అనేక మోసాలకు పాల్పడిన నాగరాజు మరోసారి అదే తరహాలో ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు. కేటీఆర్ ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని, దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వాలని నాగరాజు హైదరాబాద్ రెయిన్ బో ఆసుసత్రి ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ కు ఫోన్ చేశాడు. తనను తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు.
కేటీఆర్ ప్రమాణస్వీకారోత్సవంపై మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. అయితే, రెయిన్ బో ఆసుపత్రి ఎండీ రమేశ్ దీనిపై అనుమానంతో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీయగా నాగరాజు మోసం వెల్లడైంది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది ద్వారా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు.
గతంలో ఆంధ్రా రంజీ క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన నాగరాజు విలాసాలకు అలవాటుపడి దారితప్పాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరలేపాడు. 25 ఏళ్ల నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామం. కేటీఆర్ పీఏనని ఇప్పటికే పలుమార్లు నాగరాజు అనేకమందిని మోసగించాడు.
అంతేకాదు, టీమిండియా సెలెక్షన్ కమిటీ అప్పటి చైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్ ఫోన్ నెంబర్ ను స్పూఫింగ్ చేసి కొందరిని బోల్తా కొట్టించాడు. బెయిల్ పై బయటికి వచ్చినా బుద్ధి మార్చుకోక తరచుగా పోలీసులకు దొరికిపోతున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నాగరాజు పేరిట ఓ గిన్సిస్ బుక్ రికార్డు కూడా ఉంది. 2016లో ఏకధాటిగా 82 గంటల నెట్స్ లో బ్యాటింగ్ చేసిన నాగరాజు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.