Nadendla Manohar: కరోనానే లెక్క చేయని మా జనసైనికులు జగన్ ను ఎందుకు లెక్క చేస్తారు?: నాదెండ్ల
- ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- సర్పంచ్ ల అభినందన సభ నిర్వహించిన జనసేన
- హాజరైన నాదెండ్ల
- వైసీపీని ఎదుర్కొనే సత్తా జనసేనకే ఉందన్న నాదెండ్ల
- టీడీపీతో తమకు సంబంధంలేదని స్పష్టీకరణ
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని సర్పంచ్ ల అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో బెదిరించి ఓట్లు వేయించుకోవాలని వైసీపీ సర్కారు చూస్తోందని, అయితే ఆ తరహా ధోరణులను ఎదుర్కొనే శక్తి ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తమ జనసైనికులు కరోనాకే భయపడలేదని, ఇక జగన్ కు ఎందుకు భయపడతారని అన్నారు.
గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయగా, ఈ పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలిచింది పవన్ కల్యాణ్, జనసైనికులేనని వెల్లడించారు. పవన్ పిలుపుతో యువత ఎంతో ధైర్యంగా ముందుకొచ్చిందని, అభ్యర్థులు లేని ప్రాంతాల్లో రాత్రికి రాత్రే తమ భార్యలను, తల్లులను పోటీలో నిలబెట్టారని నాదెండ్ల వివరించారు. గతంలో టీడీపీ కూడా జన్మభూమి కమిటీలతో ఇలాంటి పరిస్థితులనే సృష్టించిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు దక్కాలంటే ఓట్లు వేస్తామని సంతకాలు చేయాలని విసిగించారని ఆరోపించారు. దాంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారని వెల్లడించారు.
ప్రస్తుత సీఎం కూడా ఒక్క చాన్స్ అంటూ వచ్చి, గెలిచాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు టార్గెట్లు పెట్టడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రులు కూడా జిల్లాల వెంటబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారని వివరించారు. గ్రామాల్లోని పరిస్థితుల దృష్ట్యా ఇతరుల మద్దతు తీసుకున్న సందర్భాలు కొన్ని ఉండొచ్చని, కానీ టీడీపీతో మాత్రం తమకు ఎక్కడా సంబంధంలేదని నాదెండ్ల స్పష్టం చేశారు.