USA: జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని బైడెన్ ఆదేశం!

Biden Orders Flag Half Mast

  • అమెరికాలో ఐదు లక్షలు దాటిన కరోనా మృతులు
  • సంతాప సూచకంగా జాతీయ పతాకాలను కిందకు దించాలని ఆదేశం
  • అమెరికాలోనే అత్యధిక కరోనా మరణాలు

అమెరికాను కరోనా వైరస్ ఎంతో అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు అమెరికాలోనే వచ్చాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ చైనాలో పుట్టినా, అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 5 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో మృతులకు సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలపై ఉన్న జాతీయ పతాకం ఎగిరే ఎత్తును సగానికి తగ్గించాలని బైడెన్ నిర్ణయించారని, వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జెన్ ప్సాకీ మీడియాకు తెలిపారు. ఐదు రోజుల పాటు పతాక అవనతం కొనసాగుతుందని అన్నారు.

కాగా, ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కోట్లాది మందికి వ్యాక్సిన్ ను అందించారు. కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ మరణాల రేటు మాత్రం ఇంకా చెప్పుకోతగిన విధంగా దిగిరాలేదు. జాన్ హాప్కిన్స్ వర్శిటీ గణాంకాల ప్రకారం, అమెరికాలో ఇంతవరకూ కరోనా మహమ్మారి బారిన పడి 5,00,071 మంది మరణించారు. ప్రపంచంలో రెండో స్థానంలో కరోనా మరణాల సంఖ్యను కలిగున్న బ్రెజిల్ తో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలు అమెరికాలో సంభవించడం గమనార్హం.

1918లో ఇన్ ఫ్లూయంజా మహమ్మారి అమెరికాను కుదేలు చేసి లక్షల మంది ప్రాణాలను తీసిన దాదాపు 100 సంవత్సరాల తరువాత వచ్చిన కరోనా మహమ్మారి అత్యంత భయానకమైనదని, ఇటువంటి పరిస్థితిని గత రెండు తరాలూ చూడలేదని బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News