Kesineni Nani: అదే జరిగితే 60 శాతం పంచాయతీలను టీడీపీ గెలిచేది: కేశినేని నాని
- వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతోంది
- పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
- టీడీపీ వారిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదు
- శాంతియుతంగా జరిగి ఉంటే టీడీపీ 60 శాతం స్థానాల్లో నెగ్గేది
ఏపీలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. ఒక మాజీ మహిళా ఎమ్మెల్యే ఇంటిపై దాడికి 40 మంది రౌడీలను పంపించారని దుయ్యబట్టారు. ఒక మహిళపై రౌడీలు దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్, డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిబంధనల ప్రకారం పోలీసులు నడుచుకోవాలని అన్నారు.
వైసీపీ వాళ్లు టీడీపీ వారిపై దాడి చేసి... తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని కేశినేని నాని దుయ్యబట్టారు. టీడీపీ వారిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదని అన్నారు. అరాచకాలు, పోలీసులు అండతో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుందని... ఎన్నికలు శాంతియుతంగా జరిగి ఉంటే టీడీపీ 60 శాతం స్థానాల్లో గెలుపొందేదని చెప్పారు.