Somu Veerraju: విష్ణువర్ధన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: సోము వీర్రాజు
- టీవీ ఛానెల్ డిబేట్లో దాడి
- దాడులు చేసేవారిని డిబేట్లకు పిలవకూడదు
- అతడిపై టీవీ ఛానెల్ వారే పోలీసులకు ఫిర్యాదు చేయాలి
తెలుగు న్యూస్ ఛానెల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అదే డిబేట్లో పాల్గొన్న ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుతో కొట్టడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
చర్చ సందర్భంగా 'పెయిడ్ ఆర్టిస్ట్ పనులు' అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహావేశాలతో శ్రీనివాసరావు తన చెప్పును తీసి, విష్ణువర్ధన్ రెడ్డికి చూపాడు. ఆ వెంటనే దానితో కొట్టాడు. దీంతో టీవీ చూస్తోన్న వారంతా షాక్ అయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డిపై ఈ దాడి ఘటన పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ... 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో లైవ్ డిబేట్ లో పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని చెప్పారు.
చర్చా వేదికలో చర్చించే సందర్భంలో సంయమనం పాటించే వ్యక్తులనే మీడియా ఛానెళ్లు పిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియంత్రణ కోల్పోతూ ఇటువంటి దాడులకు పాల్పడే వ్యక్తులను డిబేట్లకు పిలవద్దని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిపై
ఆ చానెల్ వారే ఫిర్యాదు చేయాలని అన్నారు.