Puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కోసం తమిళిసై సిఫారసు
- ఢిల్లీకి సిఫారసు లేఖ పంపిన తమిళిసై
- నేడు నిర్ణయం తీసుకునే అవకాశం
- ఇటీవలే కుప్పకూలిన నారాయణ స్వామి సర్కారు
పుదుచ్చేరిలో ప్రభుత్వం కుప్పకూలడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్రపతి పాలనకు ఈ రోజు సిఫారసు చేశారు. రెండు రోజుల క్రితం విశ్వాస పరీక్షను ఎదుర్కొని నారాయణ స్వామి ప్రభుత్వం నిలబడలేకపోయిన విషయం తెలిసిందే.
దీంతో తమిళిసై సమాలోచనలు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన సిఫారసు లేఖను ఆమె ఢిల్లీకి పంపారు. దీనిపై కేంద్ర కేబినెట్ ఈ రోజే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరసగా రాజీనామాలు చేయడంతో పుదుచ్చేరిలో ప్రభుత్వం కుప్పకూలింది.
మొత్తం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిత్రపక్ష డీఎంకే ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఆ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం బీజేపీలో చేరారు. పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు ఉండడం, ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్‌బేడీని కేంద్ర ప్రభుత్వం తప్పించడం, అనంతరం కాంగ్రెస్ రాజీనామాలు చేయడం వంటి నాటకీయ పరిణామాలు ఇటీవల ఉత్కంఠ రేపాయి. బీజేపీ తీరుపై ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.