NSE: సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్!
- రెండు సర్వీస్ ప్రొవైడర్ల లింకుల్లోనే సమస్యన్న ఎన్ఎస్ఈ
- ఉదయం 11.40 గంటల నుంచి ట్రేడింగ్ నిలిపివేత
- వీలైనంత తొందరగా పునరుద్ధరిస్తామని వెల్లడి
సాంకేతిక లోపాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీలో ట్రేడింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11.40 గంటలకు ఆగిపోయిన ట్రేడింగ్.. ఇప్పటిదాకా మొదలు కాలేదు. టెలికాం ప్రొవైడర్ల లింకుల్లో సాంకేతిక సమస్యల వల్లే అంతరాయం ఏర్పడిందని, దీంతో మొత్తం ట్రేడింగ్ ను ఆపేశామని ఎన్ఎస్ఈ ట్విట్టర్ లో ప్రకటించింది.
‘‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సేవలు అందుతున్నాయి. వాటిలో చాలా టెలికాం లింకులున్నాయి. ఆ లింకుల్లో సాంకేతిక సమస్యలున్నట్టు ఆ సర్వీస్ ప్రొవైడర్లు మాకు సమాచారమిచ్చారు. ఆ సమస్యల వల్లే ఎన్ఎస్ఈ సిస్టమ్ పై ప్రభావం పడింది. దీంతో ఉదయం 11.40 గంటలకు అన్ని విభాగాలను మూసేశాం. సిస్టమ్స్ ను వీలైనంత తొందరగా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ఎన్ఎస్ఈ ట్వీట్ చేసింది.
కాగా, బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ లో ట్రేడ్ సాఫీగానే సాగుతోందని బీఎస్ఈ ప్రకటించింది. లోపాల కారణంగా ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్ లోనూ ఇదే సమస్యతో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ కు సంబంధించి షేర్ల ధరలు సూచీలో కనిపించలేదు.