JP Nadda: అవినీతి నుంచి బెంగాల్ కు విముక్తి కల్పిస్తాం: జేపీ నడ్డా
- మమత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
- బెంగాల్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం
- అక్రమ మైనింగ్ కు ముగింపు పలుకుతాం
పశ్చిమబెంగాల్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. కోల్ కతాలో ఈరోజు ఆయన సోనార్ బంగ్లా మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత పాలనలో రాష్ట్రం అవినీతిలో మునిగిపోయిందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని చెప్పారు. అక్రమ మైనింగ్ కు ముగింపు పలుకుతామని అన్నారు. బెంగాల్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.
రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రభావం అధికంగా ఉందని... దాన్ని అరికట్టడంలో మమత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నడ్డా విమర్శించారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, శ్యామప్రసాద్ ముఖర్జీ వంటి మహానుభావులు పుట్టిన గడ్డ బెంగాల్ అని... వారి త్యాగాల స్ఫూర్తితో సోనార్ బంగ్లాను నిర్మిస్తామని చెప్పారు. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే... 73 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ లబ్దిని చేకూరుస్తామని హామీ ఇచ్చారు.