England: మరోసారి పేకమేడలా కూలిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్... టీమిండియా టార్గెట్ 49 రన్స్
- అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు
- రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- అక్షర్ పటేల్ కు 5 వికెట్లు
- 4 వికెట్లు తీసిన అశ్విన్
- మరికాసేపట్లో ముగియనున్న మ్యాచ్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజే ముగింపు దశకు చేరుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో మరీ దారుణంగా 81 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న తీరు చూస్తుంటే ఈ 49 పరుగులు సాధించడానికి టీమిండియా ఎన్ని వికెట్లు కోల్పోతుందో అని సగటు అభిమాని ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేసిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్ లో ఏమాత్రం మెరుగపడలేదు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన టీమిండియా యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదే రీతిలో బౌలింగ్ చేసి 5 వికెట్లు సాధించాడు. మరో ఎండ్ నుంచి అశ్విన్ కూడా చెలరేగి 4 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ స్టోక్స్ సాధించిన 25 పరుగులే అత్యధికం. రూట్ 19 పరుగులు చేయగా, ఓలీ పోప్ 12 పరుగులు నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.