Corona Virus: మార్చి 1 తరువాత... ఇలా వెళితే అలా కరోనా టీకా!

Walk in Vaccine from March 1 says RS Sharma

  • గుర్తింపు కార్డును తెస్తే టీకా
  • అప్పటికప్పుడే వ్యాక్సిన్ ఇస్తామన్న ఆర్ఎస్ శర్మ
  • 60 ఏళ్ల లోపువారికి డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి
  • 1507 నంబర్ తో కాల్ సెంటర్

అర్హులైన లబ్దిదారులు మార్చి 1 తరువాత కరోనా టీకాను వేయించుకునేందుకు తమ వద్ద ఉండే గుర్తింపు పత్రాలను తీసుకుని సదరు ఆరోగ్య కేంద్రానికి వెళితే సరిపోతుందని కో-విన్ ప్యానల్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. ఇండియాలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో మొదలుకానున్న వేళ, ఆయన మీడియాతు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లబ్దిదారులు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇదే సమయంలో టీకాను వేయించుకునేందుకు తమ అర్హతను తెలిపేలా వయసు గుర్తింపు కార్డును తీసుకని వెళ్లి కూడా అక్కడికక్కడే తీసుకోవచ్చని ఆయన అన్నారు.

ఇదే సమయంలో స్వీయ రిజిస్ట్రేషన్ ను కూడా సులభతరం చేశామని, తమ స్మార్ట్ ఫోన్లలో కోవిన్ డాట్ గవ్ డాట్ ఇన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్)ను ఎంటర్ చేస్తే, టీకా తీసుకునేందుకు ఎప్పుడు రావాలన్న విషయం, ఎక్కడికి రావాలన్న విషయం మెసేజ్ రూపంలో వస్తుందని ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. ఇంట్లో ఒకే వ్యక్తి వద్ద ఫోన్ ఉన్నా, అతనితో పాటు మిగతావారు కూడా రావచ్చని, గుర్తింపు కార్డు చూపి టీకా తీసుకోవచ్చని అన్నారు.

రెండో దశలో మొదట 45 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు తమకున్న దీర్ఘకాల రోగాల వివరాలు తెలిపి టీకా తీసుకోవచ్చని, 60 ఏళ్లకు పైబడిన వారు మామూలుగానే రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చని ఆయన అన్నారు. దీర్ఘకాల రోగాలు ఉన్న వారు డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాల్సి వుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోవాలా? లేదా ప్రైవేటు కేంద్రానికి వెళ్లాలా? అనే ఆప్షన్ ను కూడా ఇచ్చామని, ఎక్కడికి కావాలంటే అక్కడికి లబ్దిదారులు వెళ్లవచ్చని అన్నారు.

ప్రజలకు మరింత సమాచారాన్ని అందించేందుకు 1507 నంబర్ తో కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కేంద్రంలో ఒక రోజులో 100 మందికి టీకా వేసే సామర్థ్యముంటే, 50 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వ్యక్తులకు ఇస్తూ, అప్పటికప్పుడు వచ్చే మరో 50 మందికి ఇస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లూ (కొవాగ్జిన్, కొవిషీల్డ్) పూర్తి సురక్షితమేనని, ఏది కావాలన్న విషయాన్ని ఎంచుకునే అవకాశం మాత్రం ఇవ్వడం లేదని శర్మ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News