Corona Virus: తెలంగాణలో కరోనా టీకా ధర రూ. 400 లోపే!

Corona Vaccine Price Below rs 400 says telangana

  • 236 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
  • రెండు రోజుల్లో పూర్తి స్పష్టత
  • బహిరంగ విపణిలో టీకా దొరకదన్న ప్రభుత్వం

మరో రెండు రోజుల్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల రోగులకు కరోనా టీకాను ఇవ్వడం ప్రారంభం కానున్న వేళ, ప్రభుత్వ అసుపత్రులతో పాటు తెలంగాణలోని 236 ప్రైవేటు ఆసుపత్రులూ టీకాను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదే సమయంలో రాష్ట్రంలో టీకాను ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకుంటే, ఖరీదు ఎంత వుంటుందన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతుండగా, ప్రభుత్వం స్పందించింది.  తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, టీకా ధరపై స్పందిస్తూ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 300 నుంచి రూ. 400 మధ్య ధర ఉంటుందని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ ఫ్రంట్ లైన్ యోధులకు ఉచితంగా టీకాను అందిస్తూ వచ్చామని గుర్తు చేసిన ఆయన, స్పష్టమైన ధరపై రెండు రోజుల్లోనే తుది నిర్ణయం వెలువడుతుందని అన్నారు. టీకాను కొనుక్కుని వేయించుకున్నంత మాత్రాన బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్టుగా భావించరాదని స్పష్టం చేసిన ఆయన, ప్రస్తుతానికి అర్హతగల వారికి మాత్రమే ఇస్తామని అన్నారు.

తెలంగాణలో ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మాత్రమే టీకాను వేసేందుకు అనుమతించామని, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు టీకా వేసే అనుమతి లేదని శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా పంపిణీపై పూర్తి స్పష్టత కోసం, కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకై ఎదురు చూస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచే వయల్స్ ను ప్రైవేటు ఆసుపత్రులకు పంపించాలా? లేక వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి వస్తాయా? అన్న విషయంలోనూ క్లారిటీ రావాల్సి వుందని అన్నారు.

  • Loading...

More Telugu News