Kerala: కాంగ్రెస్ ఉదార విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు: కేరళ సీఎం విమర్శలు
- 1990ల్లో 3 లక్షల మందికిపైగా ఆత్మహత్యలు
- దానికి కాంగ్రెస్ తరఫున రాహుల్ క్షమాపణ చెప్పాలి
- విమర్శిస్తున్న వారికి అసలు నిజాలు తెలియదన్న సీఎం
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనా మండిపాటు
- రాష్ట్రంలో ఐదేళ్లలో ఎక్కడా మతకలహాలు జరగలేదని వెల్లడి
సీపీఎంతో పోరాడడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ల తీరు ఒకటేనని, వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన విధానాల వల్లే దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్ కేరళ పర్యటనపై విమర్శలు గుప్పించారు.
‘‘వయనాడ్ లో రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ తీశారు. కొల్లాంలో మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొట్టారు. కేరళపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. కానీ, ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో 70 మంది చనిపోయినా పట్టించుకోని రాహుల్.. కేరళకొచ్చి రైతులకు మద్దతునిస్తున్నారు’’ అని విమర్శించారు.
1990ల్లో కాంగ్రెస్ తీసుకొచ్చిన నవ ఉదారవాద విధానాలతో ప్రపంచంలోనే మన దేశం నుంచే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపించారు. జాతీయ నేర గణాంక బ్యూరో లెక్కల ప్రకారం ఆ కాలంలో 3 లక్షల మందికిపైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు.
రాహుల్ నియోజకవర్గమైన వయనాడ్ లో కాఫీ, మిరియాలే ప్రధాన పంటలని, కానీ, 2000 నుంచి 2005 మధ్య వాటిని పండించిన రైతులు రూ.6 వేల కోట్ల వరకు నష్టపోయారని చెప్పారు. ఎంతో మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. వీటన్నింటికీ కారణం కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలేనని మండిపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ తరఫున రాహుల్ క్షమాపణలు చెప్పాలని పినరయి డిమాండ్ చేశారు.
కేరళలో అరాచక పాలన నడుస్తోందని అంటున్న వారికి అసలు నిజాలు తెలియవన్నారు. కేరళలో ఉద్యోగాలు లేక చాలా మంది చదువుకున్న వారు దేశం విడిచి వెళుతున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారని, కానీ, చదువుకున్న వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేయవచ్చని అన్నారు. వారికి ఆ సత్తా ఉంది కాబట్టే విదేశాలకు వెళుతున్నారని చెప్పారు.
కానీ, యూపీలో ఆ పరిస్థితి లేదన్నారు. కేరళలో పనులకు వచ్చే కూలీల్లో 15 శాతం మంది యూపీ వారేనన్నారు. మలయాళీలను కేరళ ప్రభుత్వం విభజించే ప్రయత్నం చేస్తోందన్న యోగి వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. దేశంలో మత కలహాలు ఎక్కువగా యూపీలోనే జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు.