British Media: ఆ స్టేడియాన్ని నిషేధించాలి... మొతేరా టెస్టు రెండ్రోజుల్లోనే ముగియడంపై బ్రిటన్ పత్రికల స్పందన
- మూడో టెస్టులో భారత్ ఘనవిజయం
- రూట్ సేన పరాజయంపై బ్రిటన్ పత్రికల గగ్గోలు
- చెత్త పిచ్ రూపొందించారని కొన్ని పత్రికల కథనాలు
- జట్టు ఎంపిక సరిగాలేదని మరికొన్ని పత్రికల విమర్శలు
అహ్మదాబాద్ లోని మొతేరాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు రెండ్రోజుల్లోనే ముగియడం, అందునా ఇంగ్లండ్ ఘోరపరాజయం పాలవడంపై బ్రిటీష్ పత్రికలు గగ్గోలు పెట్టాయి. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ టెస్టు క్రికెట్ కు తగిన పిచ్ కానేకాదని, ఆ పిచ్ ను ఏడాది నుంచి 14 నెలల వరకు నిషేధించాలని బ్రిటన్ పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
సొంతగడ్డపై ఆడే జట్టు పిచ్ ను తమకు అనుకూలంగా రూపొందించుకుంటాయని, అయితే భారత క్రీడాస్ఫూర్తి హద్దులు దాటిందని విమర్శించాయి. ఇలాంటి పిచ్ ను రూపొందించడం ద్వారా భారత్ తన క్రీడాస్ఫూర్తి పరిధి మీరిందని 'ది మిర్రర్' పత్రికలో కాలమిస్టు ఆండీ బన్ పేర్కొన్నారు. ఎంత సొంతగడ్డపై ఆడుతున్నా, ఇలాంటి పిచ్ రూపొందిచడం తగదని అభిప్రాయపడ్డారు. భారత్ పై ఇంత తక్కువ వ్యవధిలోనే టెస్టును ఓడిపోవడం ఇంగ్లండ్ కు గత 90 సంవత్సరాల్లో ఇదే ప్రథమం అని వివరించారు.
మరికొన్ని పత్రికలు మాత్రం తమ జట్టునే తప్పుబట్టాయి. గత కొన్నాళ్లుగా ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్ పాలసీని ప్రశ్నించాయి. కీలకమైన సిరీస్ లో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ఏంటని నిలదీశాయి. పైగా ఆటగాళ్ల బ్యాటింగ్ టెక్నిక్ లోని లోపాలు కూడా మొతేరా టెస్టులో ఓటమికి దారితీశాయని పలు బ్రిటీష్ పత్రికలు విమర్శించాయి.
జట్టు ఎంపిక చెత్తగా ఉందని 'ది సన్' అభిప్రాయపడింది. కేవలం ఒక స్పిన్నర్, 11వ స్థానంలో ఆడే నలుగురు ఆటగాళ్లతో బరిలో దిగిన జట్టు ఎలా గెలుస్తుందని అభిప్రాయపడింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్లో ఇంత దారుణంగా ఎప్పుడూ ఆడలేదని 'విజ్డన్' పేర్కొంది.