Tom Holand: తప్పులో కాలేసిన ఇండియన్ ట్విట్టరాటీలు... క్రికెటర్ బదులు నటుడిపై ట్రోలింగ్!
- మొతేరాలో నరేంద్ర మోదీ పేరిట క్రికెట్ స్టేడియం
- శుభ పరిణామం కాదన్న బ్రిటన్ కు చెందిన టామ్ హోలాండ్
- స్పైడర్ మ్యాన్ నటుడిని ట్రోల్ చేస్తున్న ట్విట్టర్ యూజర్లు
స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్, తాను చేయని తప్పుకు బలైపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారత ట్విట్టర్ యూజర్లు టామ్ హోలాండ్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటారా? ఇంగ్లండ్ కు చెందిన క్రికెటర్, రచయిత టామ్ హోలాండ్, రెండు రోజుల క్రితం ఓ ట్వీట్ పెట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి తన పేరును పెట్టించుకునేందుకు నరేంద్ర మోదీ తహతహలాడారని, నాయకులు ఇటువంటి పనులు చేయడం శుభ పరిణామం కాదని వ్యాఖ్యానించారు.
అంతే, మోదీ అభిమానులు టామ్ హోలాండ్ పై విరుచుకుపడటం ప్రారంభించారు. మార్వెల్ కామిక్స్ లో భాగమైన స్పైడర్ మ్యాన్ గా ప్రపంచానికి సుపరిచితుడైన టామ్ హోలాండ్ వీరికి టార్గెట్ గా మారాడు. 'బాయ్ కాట్ స్పైడర్ మ్యాన్' పేరిట హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. అయితే, తనపై వస్తున్న ట్రోలింగ్ కు టామ్ ఇంతవరకూ స్పందించ లేదు. ఇదే సమయంలో బ్రిటన్ రచయిత టామ్ మాత్రం, "స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్ ను ఇండియా ఎందుకు నిషేధించాలని భావిస్తున్నదంటే..." అంటూ ఓ ఆర్టికల్ ను పోస్ట్ చేయడం గమనార్హం.
కాగా, అహ్మదాబాద్ లోని మొతేరాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియాన్ని ఇటీవల పునర్నిర్మించిన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, దాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ప్రధాన స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెట్టడం వివాదాస్పదమైంది.