India: జీడీపీ పెరుగుతున్నదంటే 'ఓహో' అనుకున్నాం... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అనుకోలేదు!... సోషల్ మీడియాలో సెటైర్లు
- రూ. 800 దాటేసిన గ్యాస్ సిలిండర్ ధర
- పలు ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన పెట్రోలు
- సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు
నిత్యమూ పెరుగుతూ సామాన్యులకు గుదిబండగా మారుతున్న వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల ధరలపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కామెంట్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న నెటజిన్లు, పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. 'జీడీపీ' పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, తామంతా 'గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్' (స్థూల జాతీయోత్పత్తి) అనుకున్నామని, కానీ, గ్యాస్ (జీ), డీజిల్ (డీ), పెట్రోల్ (పీ) ధరలు ఇంతగా పెరుగుతాయని ఊహించలేదని అంటున్నారు.
ఇటీవలి కాలంలో డీజిల్, పెట్రోల్ ధరలు నిత్యమూ పెరుగుతుంటే, గడచిన నెల రోజుల వ్యవధిలోనే వంట గ్యాస్ ధరలు మూడు సార్లు పెరిగాయన్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం రూ. 500కు అటూఇటుగా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 800 దాటేసింది. కమర్షియల్ సిలిండర్ అయితే రూ. 1200ను దాటేసింది. ఇక పెట్రోలు ధర చాలా ప్రాంతాల్లో రూ. 100ను దాటేయగా, మిగతా ప్రాంతాల్లో రూ. 95కు పైగానే పలుకుతోంది.
పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై పడటంతో, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలూ సామాన్యులకు దూరం అవుతున్నాయి. వెంటనే ధరలను తగ్గించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను గుర్తు చేస్తూ, వాటిని తగ్గిస్తే సరిపోతుందని సూచిస్తున్నాయి. ఎన్నో దేశాల్లో పెట్రోలు ధర ఇండియాకన్నా తక్కువగా ఉందని గుర్తు చేస్తూ, పొరుగునే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ పెట్రో ఉత్పత్తుల రేట్లను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలావుండగా,అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను సవరిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. శీతాకాలంలో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ అధికమని, ఎండలు పెరగగానే ధరలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు కూడా.