International Passenger Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను పొడిగించిన కేంద్రం
- మార్చి 31 వరకు ఆంక్షలను పొడిగించిన కేంద్రం
- కరోనా నేపథ్యంలో గత మార్చిలో ఆంక్షల విధింపు
- కార్గో, ప్రత్యేక విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు
అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలను మార్చ్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మార్చ్ 2021 అర్ధరాత్రి 11.59 గంటల వరకు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అయితే అంతర్జాతీయ సరకు రవాణా (కార్గో సర్వీసులు) విమానాలకు, డీజీసీఏ అనుమతించే ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని చెప్పింది. కేస్ టు కేస్ విధానంలో కొన్ని ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని తెలిపింది.
కరోనా వైరస్ నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని విధించారు. తదనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే కార్యాచరణలో భాగంగా అనేక ఆంక్షలను కేంద్రం సడలిస్తూ వచ్చింది. అయితే, అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మాత్రం ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. డొమెస్టిక్ విమాన సర్వీసులు గత ఏడాది చివర్లో పునఃప్రారంభమయ్యాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.