Amaravati: అమరావతి ప్రాంతంలో భూప్రకంపనలు
- తెల్లవారుజామున 5.10 గంటలకు ప్రకంపనలు
- తుళ్లూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి గ్రామాల్లో వింత శబ్దాలు
- ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు
ఏపీ రాజధాని అమరావతిలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు జనాలను బెంబేలెత్తించాయి. తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో పలు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. తుళ్లూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి గ్రామాల్లో భూమి వింత శబ్దాలు చేస్తూ కంపించింది.
దాంతో అప్పటి వరకు నిద్ర మత్తులో ఉన్న ప్రజలు భూప్రకంపనలతో ఉలిక్కి పడ్డారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా సేపటి వరకు ఇళ్ల బయటే ఉండిపోయారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకున్నారు. ప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.