Darren Gough: ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
- ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఓడినా ఆపై పుంజుకున్న టీమిండియా
- మొతేరా టెస్టులో రెండ్రోజుల్లోనే విజయం
- టీమిండియా గెలుపు తప్ప మరో ఫలితాన్ని కోరుకోవడంలేదన్న గాఫ్
- ఇంగ్లండ్ మానసికంగా కుదేలైందని వ్యాఖ్యలు
మొతేరాలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగియడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, 2000 సంవత్సరంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య హెడింగ్లేలో జరిగిన టెస్టు కూడా ఇలాగే రెండ్రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేస్ దిగ్గజం డారెన్ గాఫ్ జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. తాజాగా, మొతేరా టెస్టులో టీమిండియా ప్రదర్శనపై డారెన్ గాఫ్ స్పందించాడు.
ప్రస్తుతం టీమిండియా దృక్పథం చూస్తుంటే 90వ దశకంలో ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోందని గాఫ్ అభిప్రాయపడ్డాడు. గెలుపు తప్ప తాము మరో ఫలితాన్ని కోరుకోవడంలేదన్నట్టుగా ఆడుతోందని కితాబిచ్చాడు. తొలి టెస్టు ఓడిపోయినా ఓ జట్టుగా పుంజుకున్న తీరును ప్రశంసించాడు.
భారత్ పర్యటనలో తొలి టెస్టును గెలిచి, ఆపై వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఇంగ్లండ్ మానసికంగా కుదేలైందని గాఫ్ పేర్కొన్నాడు. ఈ పరాభవాల నుంచి కోలుకుని చివరి టెస్టులో పుంజుకోవవడం ఇంగ్లండ్ కు చాలా కష్టం అని స్పష్టంచేశాడు. టెస్టుల్లో ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడించాలన్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని గాఫ్ తప్పుబట్టాడు. టెస్టుల కంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆటగాళ్లకు రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి కల్పించడం మంచిదని సలహా ఇచ్చాడు.