Assam: అసోంలో బీజేపీకి షాక్.. కమలానికి హ్యాండిచ్చి, చేయందుకున్న బీపీఎఫ్!
- త్వరలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు
- కాంగ్రెస్‌తోనే అవినీతి రహిత, సుస్థిర ప్రభుత్వం సాధ్యమన్న మొహిలరీ
- బీజేపీ దూరం పెట్టడం వల్లే తాజా నిర్ణయం!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో బీజేపీకి ఇది షాకే. ఇప్పుడు తామిక బీజేపీతో కలిసి పోటీచేయలేమని, కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్తామని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) నేత హగ్రామా మొహిలరీ తెలిపారు. అవినీతి రహిత అసోం కోసమే తాము కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు మొహిలరీ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి సుస్థిర ప్రభుత్వం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న బీపీఎఫ్ అనంతరం బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులుగా కూడా ఉన్నారు. ఇటీవల ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హింత బిశ్వశర్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీపీఎఫ్‌తో పొత్తు ఉండబోదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీపీఎఫ్ నుంచి తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా, బోడోలాండ్ ప్రాదేశిక మండలి (బీటీసీ)లో మిత్రపక్షమైన తమను కాదని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)తో బీజేపీ చేతులు కలపడంతోనే బీపీఎఫ్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.