Peddagattu: మొదలైన పెద్దగట్టు జాతర... సూర్యాపేట రహదారి మూసివేత!
- నేటి నుంచి మొదలైన జాతర
- ఐదు రోజుల పాటు సూర్యాపేట ప్రాంతం జనసంద్రమే
- ప్రత్యామ్నాయ మార్గాల్లోకి ట్రాఫిక్ మళ్లింపు
తెలంగాణలో మేడారం తరువాత రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్ పల్లి జాతర నేటి నుంచి మొదలైన నేపథ్యంలో, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. సూర్యాపేట మీదుగా మరో ఐదు రోజుల పాటు వాహనాలను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వారు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ చేరుకుని, అక్కడి నుంచి హుజూర్ నగర్, కోదాడ మీదుగా ప్రయాణించాల్సి వుంటుందని స్పష్టం చేశారు.
ఇక విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ తరువాత హుజూర్ నగర్ రహదారిపైకి మళ్లిస్తామని, అవి మిర్యాలగూడ మీదుగా నల్గొండ, నార్కట్ పల్లి దాటి హైదరాబాద్ కు చేరుకోవచ్చని అన్నారు. కాగా, ఈ జాతర ఐదు రోజుల పాటు సాగనుండగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.