Rohit Sharma: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తమ స్థానాలు మెరుగుపర్చుకున్న రోహిత్ శర్మ, అశ్విన్
- ఇటీవల విశేషంగా రాణిస్తున్న టీమిండియా
- మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు
- 8వ స్థానానికి చేరుకున్న రోహిత్ శర్మ
- ఒక్కసారిగా 6 స్థానాలు ఎగబాకిన వైనం
- 3వ ర్యాంకులో అశ్విన్
ఇటీవల టెస్టుల్లో టీమిండియా రాణిస్తున్న తీరు విమర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు ఓడినా, ఆపై పట్టుదలతో పోరాడి సిరీస్ చేజిక్కించుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లండ్ తోనూ తొలి టెస్టును కోల్పోయినా, వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగులు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి.
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కసారిగా 6 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించాడు. రోహిత్ ప్రస్తుతం 8వ ర్యాంకులో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఎలాంటి మార్పులేదు. అయితే ఛటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై 10వ స్థానానికి పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సారథి జో రూట్ నిలిచాడు.
ఇక బౌలర్ల టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో వికెట్ల వేట సాగిస్తున్న అశ్విన్ 4 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ఈ సిరీస్ లో పెద్దగా బౌలింగ్ చేయని బుమ్రా ఒక స్థానం పతనమై 9వ ర్యాంకులో నిలిచాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ర్యాంకుల్లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. రెండో స్థానంలో కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ ఉన్నాడు.