Devdutt Padikkal: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత మోగిస్తున్న దేవదత్ పడిక్కల్
- ఐపీఎల్ తో అందరికీ తెలిసిన పడిక్కల్ టాలెంట్
- ఆర్సీబీ జట్టులో మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న వైనం
- తాజాగా దేశవాళీ టోర్నీలో వరుసగా మూడు సెంచరీలు
- నేడు రైల్వేస్ జట్టుపై అజేయంగా 145 రన్స్
- 9 ఫోర్లు, 9 సిక్సులు బాదిన కర్ణాటక యువకిశోరం
గత ఐపీఎల్ పోటీలతో వెలుగులోకి వచ్చిన యువ బ్యాట్స్ మన్ దేవదత్ పడిక్కల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మెరుపులు మెరిపించాడు. ఈ కర్ణాటక యువ కిశోరం తాజాగా భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు. ఇవాళ గ్రూప్ మ్యాచ్ లో రైల్వేస్ జట్టుపై అజేయ సెంచరీ బాదాడు. ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్ కు ఇది వరుసగా మూడో శతకం కావడం విశేషం.
ఈ మ్యాచ్ లో రైల్వేస్ పై 10 వికెట్ల తేడాతో గెలిచిన కర్ణాటక జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేటి మ్యాచ్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 125 బంతుల్లో 9 సిక్సులు, 9 ఫోర్లు బాది 145 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్ ల్లో ఒడిశాపై 152, కేరళపై 126 పరుగులు నమోదు చేశాడు.
పడిక్కల్ ఆటతీరు చాలావరకు యువరాజ్ సింగ్ స్టయిల్ ను పోలి ఉంటుంది. ఐపీఎల్ లో అతడి ఆటతీరును గమనించిన క్రికెట్ పండితులు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. బలమైన డిఫెన్సివ్ టెక్నిక్ తో పాటు, బౌలర్లపై ఎదురుదాడి చేయగల సత్తా ఉండడంతో త్వరలోనే టీమిండియా తలుపు తడతాడని భావిస్తున్నారు.