Gas Cylinder: నానాటికీ క్షీణిస్తున్న గ్యాస్ రాయితీ.. విశాఖపట్టణంలో 4 రూపాయలే!
- ఏపీలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి రూ. 4,140 కోట్ల భారం
- ఉరవకొండలో అత్యధికంగా రూ. 49 రాయితీ
- మూడు నెలల్లో రూ. 200 పెరిగినా రాయితీలో పెరుగుదల నిల్
గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ నానాటికీ క్షీణిస్తోంది. వినియోగదారుల ఖాతాలో ఒకప్పుడు రూ. 500 వరకు జమ అయ్యే రాయితీ ఇప్పుడు నాలుగు రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ. 816గా ఉండగా, వినియోగదారుల ఖాతాలో 16 రూపాయలు మాత్రమే జమ అవుతోంది. విశాఖలో సిలిండర్ ధర రూ. 800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది.
తిరుపతిలో సిలిండర్ ధర రూ. 830 కాగా, 17 రూపాయల రాయితీ లభిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో సిలిండర్ ధర రూ. 863గా ఉండగా, ఇక్కడ మాత్రం రూ. 49 రాయితీ జమ అవుతోంది. ఊరికి, ఊరికి మధ్య రాయితీ ఒక్కోలా జమ అవుతున్నా ఎక్కడా రూ. 50కి మించి జమ కాకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.15 కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌ను వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి ఏకంగా రూ.4,140 కోట్ల భారం పడుతోంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత మూడు నెలల్లో రూ.200 పెరిగింది. గతేడాది నవంబరులో రూ.616 ఉన్న సిలిండర్ ధర ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగి రూ. 816కు చేరుకుంది. ధర రూ. 200 పెరిగినా రాయితీ మాత్రం రూపాయి కూడా పెరగకపోవడం గమనార్హం.