Karnataka: హోం వర్క్ నుంచి తప్పించుకునేందుకు.. అత్యాచారం కథ అల్లిన విద్యార్థిని!
- స్కూలుకు వెళ్లి తిరిగి రాని పదో తరగతి బాలిక
- పోలీసులకు అడవిలో కనిపించిన బాలిక
- ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్న బాలిక
- వైద్య పరీక్షల్లో తేలిన అసలు నిజం
హోం వర్క్ నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం కథ అల్లిందో విద్యార్థిని. వైద్య పరీక్షల అనంతరం ఆమె చెబుతున్నది అబద్ధమని తేలింది. దీంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా, ఆమె చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గత బుధవారం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో బాలిక కనిపించింది. ఆమెను రక్షించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అనంతరం బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు దుండగులు అపహరించారని, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. అయితే, వైద్య పరీక్షల్లో మాత్రం అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో బాలికను గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం చెప్పింది. హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.