Vijayashanti: ఆ పాపాన్ని కౌన్సిల్ బీ ఫారంతో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా?: విజయ శాంతి
- కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ హత్యల పాపం టీఆర్ఎస్‌పై ఉంది
- వామనరావు దంపతులపై బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడ్డారు
- వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ హత్యల పాపాన్ని కౌన్సిల్ బీ ఫారంతో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా? వామనరావు దంపతులపై బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?' అని ఆమె ప్రశ్నించారు.
'కేసీఆర్ గారి చర్యలను.... ఆవేదనతో రగిలిపోతున్న బ్రాహ్మణులు అంతర్గత సమావేశాలలో ఆత్మసాక్షిగా ప్రశ్నించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. మంథనిలో చేసిన పాపానికి మల్కాజిగిరితో పాటు మూడు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ ఓటర్లతో ప్రక్షాళన చేసుకోవాలని సీఎం దొరగారు చేస్తున్న కపట ప్రయత్నాలను అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో బ్రాహ్మణ సామాజిక వర్గం లేదు' అని విజయశాంతి పేర్కొన్నారు.
'బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీవీ గారి బిడ్డ వాణీదేవిని బరిలోకి దించిన కేసీఆర్ గారు వామనరావు దంపతుల హత్యకు కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో... చెబితే తప్ప, ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదన్న స్పష్టమైన వైఖరితో బ్రాహ్మణ సమాజం ఉన్నట్లు కనిపిస్తోంది' అని విజయశాంతి ట్వీట్ చేశారు.
'పీవీ గారి కుమార్తెకు టికెట్ కేటాయించానని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్... బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామచందర్ రావు గారికి పడే బ్రాహ్మణ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నారనేది వాస్తవమన్నది మొత్తం తెలంగాణ సమాజపు అభిప్రాయం' అని విజయశాంతి పేర్కొన్నారు.