Atchannaidu: ఇంకా విమానాశ్రయంలోనే చంద్రబాబు.. హైదరాబాద్‌కు తరలింపు?.. మండిపడ్డ టీడీపీ నేతలు
- అరాచకాలకు ఆటంకం కలుగుతుందనే అడ్డగింత
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది: అచ్చెన్న
- ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్కసు వెళ్లగక్కుతోంది
- రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ చంద్రబాబుకి ఉంది: గోరంట్ల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలని కోరుతోన్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆయనను హైదరాబాద్ పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో టిక్కెట్లను రిజర్వు చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఆటంకం కలుగుతుందనే పోలీసులు చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకుంటున్నారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అభ్యర్థులను భయపెడుతూ వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు కలెక్టర్, ఎస్పీలను కలుస్తానంటే అందుకు అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు పోలీసులు క్షమాపణలు చెప్పి బందోబస్తు ఇచ్చి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబును అడ్డుకోవడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. 'ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్కసు వెళ్లగక్కుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ చంద్రబాబుకి ఉంది. ప్రభుత్వం ఇలా నాయకుల్ని నిర్బంధించడం, ఎయిర్ పోర్ట్ కి వచ్చిన వారిపై ఇష్టానుసారంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు.