Mansi Sehgal: ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ
- రాజకీయాల్లో ప్రవేశించిన మాజీ మిస్ ఇండియా ఢిల్లీ
- ఆప్ తీర్థం పుచ్చుకున్న మాన్సీ సెహ్ గల్
- కేజ్రీవాల్ నిజాయతీతో కూడిన పాలన ఆకట్టుకుందని వెల్లడి
- యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపు
మాజీ మిస్ ఇండియా ఢిల్లీ మాన్సీ సెహ్ గల్ రాజకీయాల్లో ప్రవేశించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన మాన్సీ సెహ్ గల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆప్ నేత రాఘవ్ చద్ధా సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.కేజ్రీవాల్ ఎంతో నిజాయతీగా సాగిస్తున్న పాలన, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా చేస్తున్న కృషి తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రేరణ కలిగించాయని ఈ సందర్భంగా మాన్సీ చెప్పారు.
ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచంలో స్వచ్ఛమైన రాజకీయాల ద్వారా గణనీయమైన మార్పు తీసుకువరావొచ్చని అభిప్రాయపడ్డారు. యువత, ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలని, ఆప్ లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి చెందిన మాన్సీ 2019లో జరిగిన ఫెమీనా అందాల పోటీల్లో మిస్ ఇండియా ఢిల్లీగా కిరీటం దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పట్టా అందుకున్నారు.