Bharat Biotech: వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన భారత్ బయోటెక్
- దేశంలో మలివిడత కరోనా వ్యాక్సినేషన్
- టీకా వేయించుకున్న ప్రధాని మోదీ
- భారత వైద్యులు, శాస్త్రవేత్తల కృషికి అభినందనలు
- మోదీ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిదాయకమన్న భారత్ బయోటెక్
- కలసికట్టుగా కొవిడ్ ను ఓడిద్దామని ఉద్ఘాటన
దేశంలో మలివిడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య సంస్థలో ఆయన కొవాగ్జిన్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. అనంతరం స్పందిస్తూ, ఇంత తక్కువ వ్యవధిలో మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు కృషి చేసి ప్రపంచవ్యాప్త కరోనా పోరాటానికి దన్నుగా నిలవడం గొప్పగా ఉంది అని వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ బయోటెక్ పరిశోధన సంస్థ స్పందించింది.
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ప్రధాని చూపుతున్న ఘనతర అంకితభావం స్ఫూర్తిదాయకం అని కొనియాడింది. ప్రధాని పిలుపునిచ్చిన మేరకు మనందరం కలిసికట్టుగా పోరాడి కొవిడ్-19పై విజయం సాధిద్దాం అని భారత్ బయోటెక్ ఉద్ఘాటించింది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు దేశంలో అత్యవసర అనుమతులు లభించిన సంగతి తెలిసిందే.