Revanth Reddy: షర్మిలను చూసి తట్టుకోలేకపోతున్నారు: రేవంత్ రెడ్డిపై తూడి దేవేందర్ రెడ్డి ఫైర్
- వైయస్ పేరును రేవంత్ వాడుకోవాలనుకున్నారు
- గతంలో వైయస్ ను రేవంత్ విమర్శించారు
- కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎప్పుడు చేరారో అందరికీ తెలుసు
తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ప్రతి రోజు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్యార్థులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఓ విద్యార్థి వేదికపై బాధపడటం, అతన్ని షర్మిల ఓదార్చడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సదరు వ్యక్తి అసలు విద్యార్థే కాదని, కల్వరి టెంపుల్ లో డ్రమ్స్ వాయిస్తాడని చెప్పారు. అతనితో కలిసి షర్మిల డ్రామాను రక్తి కట్టించారని వ్యంగ్యంగా అన్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి ఈరోజు లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడుతూ, రేవంతర్ రెడ్డిపై మండిపడ్డారు. రాజకీయంగా షర్మిల ఎదుగుతుండటాన్ని రేవంత్ తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. తండ్రిని కోల్పోయానంటూ షర్మిల వద్ద ఓ విద్యార్థి బాధ పడితే... ఈ విషయానికి రేవంత్ రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు.
వైయస్ రాజశేఖరరెడ్డి పేరును రేవంత్ వాడుకోవాలనుకున్నారని అన్నారు. గతంలో వైయస్ ను విమర్శించిన రేవంత్... ఇప్పుడు పొగుడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎంత కాలం క్రితం చేరారో అందరికీ తెలుసని అన్నారు. వైయస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు ఏ పార్టీలోకైనా పోవచ్చని చెప్పారు.