Ambati Rambabu: చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతోంది: అంబటి రాంబాబు
- ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు
- ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా?
- పోలీసు అధికారి మోకాళ్లపై కూర్చొని దండం పెట్టినా చంద్రబాబు ఒప్పుకోలేదు
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
ప్రజల్లో కొత్త భ్రమలను కలిగించేందుకు రేణిగుంట విమానాశ్రయంలో డ్రామా ఆడారని... ఆయన తాబేదారు మరొకరు ఎస్ఈసీ వద్ద రచ్చ చేశారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి పది సీట్లు కూడా రాలేదని చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపుల వల్లే ఓడిపోయానని... తనకు ఎంతో ప్రజాదరణ ఉందని టీడీపీ క్యాడర్ ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ ఓటమికి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కారణమని అంబటి అన్నారు. చంద్రబాబుపై టీడీపీ కార్యకర్తలకే నమ్మకం లేదని చెప్పారు. కరోనా సమయంలో దీక్ష చేస్తానంటే చట్టాలు ఒప్పుకుంటాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్న తరుణంలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు. ఓ పోలీసు అధికారి మోకాళ్లపై కూర్చొని దండం పెట్టినా చంద్రబాబు ఒప్పుకోలేదని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పిరికివాడని చంద్రబాబు అంటున్నారంటే... ఆయన ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోందని అంబటి విమర్శించారు. చంద్రబాబు, ఆయన కుమారుడే పిరికివాళ్లని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అభాసుపాలు కాకుండా చట్ట ప్రకారం వ్యవహరిస్తే మంచిదని చెప్పారు.