Prashant Kishor: అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్!
- పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్
- ప్రధాన సలహాదారుడిగా పీకేకు కేబినెట్ హోదా
- అమరీందర్ అడిగితే తాను కాదనలేనన్న పీకే
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక బాధ్యతలను అప్పగించారు. తన ప్రధాన సలహాదారుడిగా ఆయనను నియమించారు. నాలుగేళ్ల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు ప్రశాంత్ కిశోర్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మరోసారి పంజాబ్ లో తన వ్యూహాలను అమలు చేయబోతున్నారు.
తన ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్ ను నియమించినట్టు తెలియజేయడానికి తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమరీందర్ సింగ్ తెలియజేశారు. పంజాబ్ ప్రజల అభివృద్ధి కోసం ప్రశాంత్ తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ నియామకానికి పంజాబ్ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని సీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుందని తెలిపింది.
మరోవైపు దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ... ఈ అంశం గత ఏడాదిగా టేబుల్ పై ఉందని అన్నారు. అమరీందర్ సింగ్ తనకు సొంత కుటుంబం వంటివారని... ఆయనకు నేను కాదని చెప్పలేనని తెలిపారు.