CJI: ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?... మేం సాయం చేస్తాం: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సీజేఐ ప్రతిపాదన
- మహారాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగిపై అత్యాచార ఆరోపణలు
- పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశాడంటూ కేసు
- సుప్రీం కోర్టు ముందుకు చేరిన వ్యవహారం
- పెళ్లి చేసుకుంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చన్న ఎస్ఏ బోబ్డే
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఆసక్తికర ప్రతిపాదన చేసింది. అత్యాచార ఆరోపణలు చేసిన అమ్మాయిని పెళ్లాడితే అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చని సూచించింది. అసలేం జరిగిందంటే.... మహారాష్ట్ర విద్యుత్ శాఖలో మోహిత్ సుభాష్ చవాన్ ఓ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు రాగా, అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ, "ఆ అమ్మాయిని నువ్వు పెళ్లాడాలనుకుంటే అందుకు మేం సాయం చేస్తాం. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం కోల్పోయి జైలుకు వెళతావు. నువ్వామెను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డావు మరి!" అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై ఆ విద్యుత్ శాఖ ఉద్యోగి స్పందిస్తూ... "ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించిన తర్వాత, మా అమ్మ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అయితే ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకునేట్టు ఓ పత్రం రాయించుకున్నారు. ఆమెకు 18 ఏళ్లు నిండగానే నేను పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్లు రేప్ కేసు పెట్టారు" అని వివరించాడు.
దాంతో సీజేఐ బదులిచ్చారు. "ఆ అమ్మాయిని మభ్యపెట్టి అత్యాచారం చేసినప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సింది. నువ్వో ప్రభుత్వ ఉద్యోగివన్న సంగతి నీకూ తెలుసు" అని పేర్కొన్నారు. దాంతో ఆ ఉద్యోగి తన మనసులో మాటను ధర్మాసనం ముందుంచాడు.
మొదట ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించానని, అయితే ఆమె అందుకు నిరాకరించిందని చెప్పాడు. కానీ ఇప్పుడు తాను ఓ వివాహితుడ్నని వెల్లడించారు. తనను అరెస్ట్ చేస్తే ఉద్యోగం పోతుందని అతడు వేడుకున్నాడు.
అందుకే కదా నీకు ఊరట కలిగించేలా మేం ప్రతిపాదన చేసింది అని సీజేఐ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. 'అయితే నీ అరెస్ట్ పై నాలుగు వారాలు స్టే ఇస్తాం. ఆ తర్వాత నువ్వు సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు' అని స్పష్టం చేశారు..