GST: మరోసారి రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
- ఈ ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
- గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 7 శాతం అధికం
- వరుసగా ఐదో నెల లక్ష కోట్లు దాటిన వైనం
- 2021 జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
- రూ.1.20 లక్షల కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ హై
ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో 1.13 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వసూలైనట్టు తెలిపింది. దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటడం వరుసగా ఐదోసారి. గతేడాది ఫిబ్రవరి నాటి వసూళ్లతో పోల్చితే ఈసారి 7 శాతం అధికం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వివరించింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే ఈ ఫిబ్రవరిలో వస్తు దిగుమతులపై వసూళ్లు 15 శాతం అధికం అని, దేశీయ లావాదేవీలపై 5 శాతం ఎక్కువగా వసూళ్లు వచ్చాయని వెల్లడించింది.
కాగా, 2021లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఉపసంహరించుకోవడంతో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఒక్కసారిగా ఉరకలెత్తాయి. 2017లో జీఎస్టీ విధానం తీసుకువచ్చాక జనవరి వసూళ్లే అత్యధికం.