Varavararao: వరవరరావును రూ.50 వేల పూచీకత్తుపై విడుదల చేసేందుకు అనుమతించిన బాంబే హైకోర్టు
- ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావు అరెస్ట్
- బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- మహారాష్ట్రలో బెయిల్ కు ఆస్తి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
- దాంతో వరవరరావు విడుదల ఆలస్యం
- బాంబే హైకోర్టును ఆశ్రయించిన కుటుంబసభ్యులు
ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బెయిల్ లభించినా, ఆయన విడుదల ఆలస్యం అయింది. అందుకు కారణం మహారాష్ట్రలోని బెయిల్ ష్యూరిటీ నిబంధనలే. మహారాష్ట్రలో బెయిల్ ష్యూరిటీకి ఆస్తి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నగదు పూచీకత్తులు, శాలరీ సర్టిఫికెట్లను ఇక్కడ అంగీకరించరు. దాంతో వరవరరావు విడుదల కోసం కుటుంబ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
నగదు పూచీకత్తుపై విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, రూ,50 వేల విలువ చేసే రెండు నగదు పూచీకత్తులను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బెయిల్ పత్రాల ప్రక్రియ పూర్తయితే వరవరరావు మంగళవారం ముంబయిలోని తలోలా జైలు నుంచి విడుదల అవుతారు.