YSRCP: జగన్ బాబాయి, మంత్రి రంగనాథరాజు నాపై కుట్ర చేస్తున్నారు: రఘురామ కృష్ణరాజు
- నాపై ఒకే రోజు ఒకే సమయంలో పదికిపైగా కేసులు
- నా నియోజకవర్గంలో పర్యటించకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు
- తాడేపల్లి పెద్దలకు కూడా కుట్రలో భాగస్వామ్యం
- ఏయూ వీసీని తప్పించాలని గవర్నర్‌ను కోరా
రాజ్యాంగాన్ని కాపాడాలని ఇటీవల ప్రధానిని కోరిన తనపై ఏపీ సీఎం జగన్ బాబాయి, తన జిల్లా మంత్రి రంగనాథరాజు కలిసి కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తాడేపల్లి పెద్దలు కూడా ఈ కుట్రలో ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని, ప్రివిలేజ్ నోటీసులు పంపుతానని పేర్కొన్నారు. ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటించాలనుకుంటున్న తనను తన పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.
హిందూ దళితులు, క్రైస్తవుల మధ్య చిచ్చు రాజేసేందుకు ప్రయత్నిస్తున్నానంటూ తనపై ఒకే రోజు ఒకే సమయంలో 10కిపైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. క్రైస్తవంలో దళితులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఓ కులానికి అనుకూలంగా మాట్లాడిన ఏయూ వైస్ చాన్స్‌లర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. ఎంపీగా తన హక్కులను కాలరాసేందుకు టీటీడీ చైర్మన్ ప్రయత్నిస్తున్నారని, తన సిఫార్సులను తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు.