USA: కొత్త రకం కరోనాతో అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు: సీడీసీ
- బ్రిటన్ రకం కరోనాతోనే దేశంలో ఎక్కువ కేసులు
- వ్యాక్సినేషన్ పై ప్రభావం చూపించే ప్రమాదముందని ఆందోళన
- కేసులు మరిన్ని పెరగకముందే వీలైనంత ఎక్కువ మందికి టీకా వేయాలని సూచన
కరోనా వైరస్ లో జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు పొంచి ఉందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించారు. కొత్తగా వస్తున్న కరోనా వేరియంట్లతో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. గత వారం అమెరికాలో రోజూ సగటున 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, అది చాలా తీవ్రమైన విషయమని ఆమె అన్నారు. సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని రోజులు నియంత్రణలోనే ఉన్న కరోనా కేసులు.. ఇప్పుడు కొత్త రకం కరోనాతో మరింత పెరుగుతున్నాయన్నారు. బ్రిటన్ వేరియంట్ అయిన బీ.1.1.7తోనే అమెరికాలో ఎక్కువ కేసులు వస్తున్నాయన్నారు. వ్యాక్సినేషన్ పై ఈ కొత్త రకం కరోనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కేసులు మరిన్ని పెరిగే లోపే వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటిదాకా అమెరికాలో 7.6 కోట్ల మందికి కరోనా టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ లో ఆ దేశం అగ్రస్థానంలో నిలిచింది. కాగా, దేశంలో 2 కోట్ల 93 లక్షల 14 వేల 254 మంది కరోనా బారిన పడగా.. 5 లక్షల 27 వేల 226 మంది బలయ్యారు.