Congress: బెంగాల్ లో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ లో విభేదాలు!
- ఐఎస్ఎఫ్ తో పొత్తుపై ప్రశ్నించిన సీనియర్ నేత ఆనంద్ శర్మ
- నిజాలు తెలుసుకోవాలంటూ చురకలంటించిన మరో నేత అధీర్ రంజన్ చౌదరి
- సొంత లాభం కోసం పాకులాడుతున్నారని విమర్శ
- ప్రధానిని పొగడడం మానుకోవాలంటూ మండిపాటు
- బీజేపీ ఎజెండా కోసం సొంత చెట్టును నరుక్కోవద్దని హితవు
కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. మతతత్వంపై కాంగ్రెస్ పోరాటం ఎప్పుడూ ఒక్కదానిమీదే ఉండకూడదని సూచించారు.
అయితే, ఆయన వ్యాఖ్యలకు మరో సీనియర్ నేత, లోక్ సభా పక్షనేత అధీర్ రంజన్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ చురకలంటించారు. ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం మానేయాలని హితవు పలికారు. కొందరు కాంగ్రెస్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. దీనిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘బెంగాల్ లో ఐఎస్ఎఫ్ కు సీపీఎం నేతృత్వం వహిస్తోంది. అందులోనే కాంగ్రెస్ కూడా ఉంది. బీజేపీ మత, విభజన వాద రాజకీయాలు, అరాచక పాలనను ఓడించాలన్నదే మా లక్ష్యం. కూటమిలో కాంగ్రెస్ కు రావల్సినన్ని సీట్లు వచ్చాయి. కొత్తగా ఏర్పాటైన ఐఎస్ఎఫ్ కూటమిలో సీట్లను సీపీఎం పంచుతుంది. అలాంటి సీపీఎం కూటమికి మతం రంగును పులమడం, బీజేపీ మత ఎజెండాలకు లాభం చేకూరుస్తుంది.
బీజేపీ విష మతపు ఎజెండాను వ్యతిరేకించే వాళ్లంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలి. అంతేతప్ప బీజేపీ ఎజెండా కోసం సొంత పార్టీని తక్కువ చేసి మాట్లాడవద్దు. వ్యక్తిగత ప్రయోజనాలు, సౌకర్యం కోసమే కొందరు నేతలు పాకులాడుతున్నారు. వారంతా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించడం ఆపేయాలి. పార్టీని పటిష్ఠం చేసేందుకు ప్రయత్నించండి తప్ప.. సొంత కొమ్మను నరికే ప్రయత్నం చేయకండి’’ అని అధీర్ ట్వీట్ చేశారు.