USA: చైనా, రష్యాకు చెక్ పెట్టాలంటే ఏఐ ఆయుధాలపై వెనక్కి తగ్గేది లేదు: అమెరికా నివేదిక
- ఏఐ ఆయుధాలను నిషేధించాలన్న నివేదికను వ్యతిరేకించాలని మిత్ర దేశాలకు పిలుపు
- ఆ ఆయుధాల వాడకంపై నివేదికను తయారు చేసిన అమెరికా జాతీయ భద్రతా కమిషన్
- వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఏఐ ఆయుధాలు కావాల్సిందేనని వెల్లడి
- చైనా, రష్యాలు ఏఐ ఆయుధాలు వాడవన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్న
అత్యాధునిక ఆయుధాల వాడకం విషయంలో వెనక్కు తగ్గేది లేదని అమెరికా అంటోంది. కృత్రిమ మేధ ఆయుధాల వాడకాన్ని నిషేధించాలన్న నివేదికను వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఆ నివేదికను వ్యతిరేకించాల్సిందిగా మిత్ర దేశాలకూ సూచించింది.
మనుషులు వేగంగా తీసుకోలేని సైనిక నిర్ణయాలను కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా తీసుకోగలుగుతుందని పేర్కొంది. అమెరికా, ఇతర మిత్ర దేశాలు ఆ ఒప్పందంలో చేరినంత మాత్రాన.. రష్యా, చైనాలు ఆ ఒప్పందాన్ని అమలు చేస్తాయన్న గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేసింది.
ఏఐ ఆయుధాలపై అమెరికా ప్రభుత్వం నియమించిన జాతీయ భద్రతా కమిషన్ (ఎన్ఎస్సీ).. ఏఐ ఆయుధాలకే మొగ్గు చూపుతూ ఓ నివేదికను తయారు చేసింది. గూగుల్ మాజీ చీఫ్ ఎరిక్ ష్మిట్, మాజీ రక్షణ శాఖ సహాయ మంత్రి రాబర్ట్ వర్క్, అమెజాన్ సెకండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాండీ జాసీ, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతులు డాక్టర్ ఆండ్రూ మూరే, డాక్టర్ ఎరిక్ హార్విజ్, ఓరకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాఫ్రా క్యాట్జ్ ఆ కమిషన్ లో సభ్యులుగా ఉండడం గమనార్హం.
అయితే, అమెరికా నిర్ణయంపై నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కృత్రిమ మేధ ఆయుధాల వాడకం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఎవరు చంపాలి? ఎవర్ని చంపాలి? అన్నది ఏఐ నిర్ణయించడం చాలా దారుణమైన విషయమని క్యాంపెయిన్ టు స్టాప్ కిల్లర్ రోబోట్స్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ప్రొఫెసర్ నోయెల్ షార్కీ అన్నారు. వాటి వల్ల ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నా.. వాటిని వాడదామనడం చాలా దారుణమన్నారు.
అయితే, వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బైడెన్ ప్రభుత్వం చెబుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు లోబడే వాటిని తయారు చేస్తారని, అన్ని పరీక్షలు పెట్టాకే సైన్యంలోకి తీసుకుంటారని చెబుతున్నట్టు సమాచారం. చైనా, రష్యాకు చెక్ పెట్టాలంటే ఏఐ ఆయుధాలు తప్పనిసరి అని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
చైనాగానీ ఏఐ ఆయుధాలను సమకూర్చుకోవడంలో వేగం పెంచుకుంటే అమెరికా సైనిక శక్తి తగ్గిపోతుందని, చైనా ముందంజ వేస్తుందని పేర్కొన్నట్టు సమాచారం. అది అమెరికాకు పెను ముప్పుగా పరిణమిస్తుందని వెల్లడించింది. కాగా, అణ్వాయుధాలపై మాత్రం ఓ పరిమితిని పెట్టాల్సిందిగా నివేదికలో ఎన్ఎస్సీ పేర్కొంది. 2019 మార్చి నుంచే ఏఐ ఆయుధాలపై ఎన్ఎస్ సీ సమీక్ష నిర్వహిస్తోంది. తాజాగా ఆ నివేదికను విడుదల చేసింది.