Jagan: రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం: సీఎం జగన్

AP CM Jagan attends India Maritime Summit inaugurated by PM Modi

  • ఇండియా మారిటైమ్ సదస్సు ప్రారంభించిన మోదీ
  • మార్చి 4 వరకు సదస్సు
  • పాల్గొన్న ఏపీ, గుజరాత్ సీఎంలు, కేంద్రమంత్రులు
  • ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందన్న సీఎం జగన్
  • పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలున్నాయని వెల్లడి

ఇండియా మారిటైమ్ సదస్సులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఈ సదస్సులో సీఎం జగన్ తో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర మంత్రులు, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

రాష్ట్రంలో నౌకాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీలో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని, పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. 75 శాతం ఎగుమతులు సముద్రమార్గం ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. కాగా, ఇండియా మారిటైమ్ సమ్మిట్ లో సీఎం జగన్ వివరించిన మరికొన్ని అంశాలను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

తీరప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండడంతో పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీరప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువ అని అభిప్రాయపడ్డారు.  

2023 నాటికి రామాయపట్నం పోర్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ అంశాలన్నింటిని సీఎం జగన్ మారిటైమ్ సదస్సులో వివరించారని గౌతమ్ రెడ్డి చెప్పారు.

కాగా ఈ మారిటైమ్ సదస్సులో అమెరికా, ఖతార్, డెన్మార్క్, రష్యా, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాల ప్రతినిధి బృందాలు కూడా పాల్గొంటున్నాయి.

  • Loading...

More Telugu News