Municipal Elections: ఏపీ మునిసిపల్ ఎన్నికలు.. తొలి రోజు 222 ఏకగ్రీవాలు
- ఉపసంహరణ తర్వాత 221 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు
- కొవ్వూరులోని ఒకే ఒక్క వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం
- నేడు అధికారకంగా ప్రకటించే అవకాశం
- కడపలో అత్యధికంగా 100 స్థానాల్లో ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల తొలి రోజు అయిన నిన్న కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 222 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లే మిగిలాయి. ఫలితంగా ఇవన్నీ ఏకగ్రీవమైనట్టే. వీటిలో 221 చోట్ల వైసీపీ అభ్యర్థులే ఉండడం గమనార్హం. అయితే, నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండడంతో ఆ తర్వాత ఏకగ్రీవమైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కడప జిల్లాలో అత్యధికంగా 100 డివిజన్ లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో పులివెందుల మునిసిపాలిటీలో మొత్తం 33 వార్డులలోను ఒక్కటి చొప్పున నామినేషన్లు మిగిలాయి. ఇక, చిత్తూరులో 37, కర్నూలులో 36, అనంతపురం జిల్లాలో 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 11 డివిజన్, వార్డు సభ్యుల స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే ఏక్రగీవాలు అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం కానున్నారు.